విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా ఆందోళనలు చెలరేగాయి. శివమొగ్గలోని మాజీ సీఎం యడ్యూరప్ప ఇంటిపై దాడి జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. కాగా విద్యా, ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లను కొత్తగా వర్గీకరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఏజే సదాశివ కమిషన్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త రిజర్వేషన్ విధాన ప్రతిపాదనకు నిరసనగా ఆందోళనకారులు.. సీఎం బస్వరాజు బొమ్మై, యడ్యూరప్ప చిత్రపటాలను దహనం చేశారు. యడ్యూరప్ప నివాసం ముందు వేలాది మంది నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఈ ఆందోళన హింసాత్మకమైంది. కొందరు యడ్యూరప్ప ఇంటిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు గాయపడ్డారు. ఇక ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు.. వాటర్ క్యానన్లను ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు.