ఈటెల రాజేందర్ మాట్లాడేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు మంత్రి జగదీశ్ రెడ్డి. పలివేల గ్రామంలో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మెజారిటీ రాదని తెలిసి సానుభూతి కోసమే డ్రామాలు ఆడుతున్నారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. బిజెపి చరిత్ర దాడులు, దుర్మార్గాలని మండిపడ్డారు. అంత దుర్మార్గమైన పార్టీలో ఉండి ఈటెల ధర్మం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎవరిమీద దాడి చేయలేదని.. కెసిఆర్ ఎనిమిదేళ్ల పాలనలో రాజకీయ ఘర్షణలు జరగలేదని అన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండేళ్లుగా ఈటెల ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. జనాలు లేక బిజెపి సభలను రద్దు చేసిందని అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసులతో ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. సానుభూతి పొందేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.