సనాతన ధర్మంలో అనేకానేక శాస్త్రీయ అంశాలు. సైన్స్ దాగి ఉన్నాయి. వాటిని పరిహసించడం మాని వాటిలోని రహస్యాలను తెలుసుకుంటే చాలు. కొన్ని కొన్ని మూఢనమ్మకాలు మధ్యకాలంలో చేరి ఉండవచ్చు. జాగ్రత్తగా వాటిని వేరిపారేసి అసలైన సనాతనధర్మాన్ని ఆచరిస్తే మానవాళి నిత్యసంతోషంగా ఉండవచ్చు. జూలై 16 దక్షిణాయనం సందర్భంగా ఏడాదికి రెండు అయనాలు. వాటి వెనుక సైన్స్ విషయాలను పరిశీలిద్దాం…
సూర్య గమణాన్ని బట్టి మనవారు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు . భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం.. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. ‘అయనం’ అంటే ప్రయాణం అని అర్ధం.
దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయాన్ని గమనిస్తే, అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21, సెప్టెంబరు 23. మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా, మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ‘ఉత్తరాయాణం’ అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ‘దక్షిణాయనం’ అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.
సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.
ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు. ఈ కాలంలో అనేక పండుగలు వస్తాయి.
-శ్రీ