ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అంటూ ఓ కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారితం అవుతుంది. ఆంధ్రజ్యోతి ప్రసార మాధ్యమంలో ఇది టెలికాస్ట్ అయ్యాక ప్రింట్ లో కూడా సంబంధిత ప్రశ్న, జవాబుల సంగ్రహ సారం వస్తుంది. మొత్తంగా ఇది ఒక మూడు రోజుల సందడి. శని వారం నుంచి ప్రొమోల గోల మొదలయితే సోమవారం ఆంధ్రజ్యోతి సంచికలో ఆ విశేషాలు ప్రచురితం కావడంతో ముగిసిపోతుంది.
ఇదే కార్యక్రమానికి ఆ మధ్య చింతకాయల అయ్యన్న పాత్రుడు అనే మాజీ మంత్రి, ఆయన కుమారుడు, పారిశ్రామికవేత్త చింతకాయల విజయ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పుడు కూడా ఆర్కే మీరు మీ భాష మార్చుకోరా అంటే అప్పుడు కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తన దృష్టిలో తప్పే కావని తేల్చేశారు. అదేవిధంగా తాను ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశానో కూడా వివరణ ఇచ్చారు ఆయన. అవి కూడా ఏ మాత్రం సమర్థనీయ ధోరణిలో లేవు. పోనీ ఆ ఇంటర్వ్యూలో అయినా వైజాగ్ నగరంను పర్యావరణ పరంగా వైసీపీ ఏ విధంగా దెబ్బతీస్తుందో అన్నది ఆధారాలతో సహా వివరించారా అంటే అదీ లేదు. కేవలం కొన్ని రాజకీయ ఆరోపణలు చేయడం తప్ప ఆయన కొత్తగా సాధించిందేమీ లేదు.
దీంతో చేసేది లేక ఆర్కే ఇదే ప్రశ్నను విజయ్ ను అడిగారు. ఆయన సరే ! మీ నాన్నగారు రాజకీయ రంగంలో చాలా సీనియర్.. మీకేమయింది.. మీరు అలా మాట్లాడకూడదు కదా ! ఓ సీఎంను వాడు వీడు అని అనవచ్చా అని కూడా అన్నారాయన. అప్పుడు కాస్త గొంతు తగ్గించి, ఇకపై ఆ విధంగా మాట్లాడనని, కాస్త ఆలోచిస్తానని మాత్రమే చెప్పారు తప్ప అవి తప్పు అని ఆయన కూడా ఒప్పుకోలేకపోయారు. ఇ వన్నీ కూడా నిన్నటి గోడ కూల్చివేత ఘటనకు కారణం అయి ఉండవచ్చు. తమ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగానే ఈ విధంగా చర్యలు తీసుకుని ఉంటారని వైపీపీ అంటోంది.