మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గంటా శ్రీనివాసరావు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమను గెలిపిస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు చాలా ఆశపడ్డారు. అయితే తాజాగా బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీ మారే అవకాశాలున్నాయని అన్నారు.
ఆయన ఎక్స్ అఫిషియో ఓటు వైసీపీలో వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని అందుకే ఆయన రాజీనామాను ఆమోదించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనితో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
గంటా శ్రీనివాసరావు విషయంలో ముందు నుంచి కూడా చంద్రబాబు జాగ్రత్తగానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు బాధ్యతలను తగ్గించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడానికి రెడీ అయ్యారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ జిల్లా నేతలతో చర్చలు జరిపారట చంద్రబాబు నాయుడు. గంటా శ్రీనివాసరావు ఒకవేళ దెబ్బ కొట్టిన సరే గెలిచిన అభ్యర్థులను జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు జిల్లా పార్టీ నేతలకు పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే గంటా శ్రీనివాసరావు కోసం భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.