బెజవాడ టీడీపీ రాజకీయాలు మారుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా కూటమి పాలిటిక్స్ ఊపందుకున్నాయి. ఆయన వైఖరితో విసిగిపోయిన కమ్మ సామాజకి వర్గం నేతలే ఇప్పుడు నానికి దూరంగా జరుగుతున్నారు. అదే సమయంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు మద్దతు తెలుపుతున్నారు. దీంతో రాజకీయంగా నగరంలో హాట్ టాపిక్ చర్చకు వచ్చింది. కొన్నాళ్లుగా నాని టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాను రెండు సార్లు ఎంపీగా గెలిచినా పార్టీలో ప్రాధాన్యం లేదని తనను పక్కన పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు కుమ్మరిస్తున్నారు. ఈ క్రమంలో మరీ ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమాను టార్గెట్ చేస్తున్నారు.
ఒకానొక సందర్భంలో చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్‌ను సైతం పరోక్షంగా విమర్శించారు. పైగా తాను ప్రజల్లో క్రేజ్‌తోనే గెలిచానని.. కొందరికి అది కూడా లేదంటూ పరోక్షంగా లోకేష్‌ను ఎద్దేవా చేస్తూ కౌంటర్లు విసిరారు. అప్పటి నుంచే పార్టీ అధిష్టానం, చంద్రబాబు నానిని పక్కన పెట్టుకుంటూ వస్తున్నారు. విజయవాడలో కేశినేని నాని రెండోసారి విజయంసాధించడం వెనుక కమ్మ వర్గం బలమైన పోరాటం చేసింది. అయితే.. అదే వర్గాన్ని ఆయన టార్గెట్ చేసుకుని చంద్రబాబుపై విమర్శలు చేయడంతో వారు సహించలేక పోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల లారీ ఓనర్స్ అసోయేషన్‌లోని బలమైన కమ్మ వర్గం భేటీ అయి.. తమకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న కేశినేని నానిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి.
అదే సమయంలో పార్టీలోనూ కమ్మ వర్గం కూటమిగా ఏర్పడి నానికి వ్యతిరేకంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఇక, సౌమ్యుడు, ఇదే సామాజిక వర్గానికి చెందిన గద్దె రామ్మోహన్‌ను అందరూ సానుకూలంగా భావిస్తుండడం గమనార్హం. అంతేకాదు మరో కీలక పరిణామం దిశగా కూడా టీడీపీ నాయకులు చక్రం తిప్పుతున్నారు. మేయర్ పీఠాన్ని కేశినేని నాని కుమార్తె శ్వేతకు వద్దని కూడా సిఫారసు చేయాలని నిర్ణయించుకోవడం మరింత సంచలనంగా మారింది.
ఎప్పటి నుంచో.. ఈ పీఠం కోరుతున్న గద్దె అనురాధకు ఇవ్వాలని. అందరినీ కలుపుకొనిపోవడం.. వివాద రహితంగా వ్యవహరించడం, సమస్యలపై సానుకూల దృక్ఫథం, ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండడం వంటి వాటిని వారు గద్దె కుటుంబం విషయంలో ప్రస్తావిస్తున్నారు. ఇలా ఎటు చూసినా కేశినేని నానిని ఏకాకి అవుతున్నారనే వాదన బెజవాడ రాజకీయాల్లో బలంగా వినిపిస్తుండడం గమనార్హం. అదే సమయంలో గద్దెతో అంతంత మాత్రం సఖ్యతతో ఉండే మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి వాళ్లు సైతం ఇప్పుడు గద్దెనే పరోక్షంగా సపోర్ట్ చేస్తోన్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో నాని మరింత కాకతో రగులుతారా ? లేదా గమ్మునుంటారా ? అన్నది చూడాలి.