సీఎం జగన్ తో మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి భేటీ ముగిసింది. ఒంగోలులో భూ అక్రమాల కేసు విషయంలో ఈ మధ్య రేగిన వివాదం.. పార్టీలో కొంత మంది తనను టార్గెట్ చేస్తున్నారు అనే అన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఎన్టీవీతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. పార్టీ మారే ఉద్దేశ్యం ఉంటే ఇక్కడికి రాను అని తెలిపారు. నాలుగేళ్ల మంత్రి పదవి వదులుకుని జగన్ కోసం వచ్చిన వాడిని.. ముఖ్యమంత్రి దగ్గరకు రావటానికి నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు.
ఎప్పుడైనా రావచ్చని సీఎం కూడా చెప్పారు.. నేను చాలా సెన్సిటివ్.. మీడియాను అడ్డం పెట్టుకుని నన్ను ఎవరైనా అంటే సహించను.. నా మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళాను.. అన్ని విషయాలు జగన్ కు తెలుసు.. ప్రకాశం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణంలో సీఐడీ అవసరం లేకుండా 21 మందితో టీంలను ఏర్పాటు చేశారు అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. నేను ఎవరి జోలికి వెళ్ళను.. నా జోలికి ఎవరు వచ్చినా ఊరుకోను అని బాలినేని అన్నారు. తన రాజకీయ జీవితంలో వివాదాలు లేవన్న బాలినేని.. జిల్లాలో ఉన్న రాజకీయ ఇబ్బందులు ఎప్పుడో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లానని, ఆయనే చూసుకుంటా అన్నారని తెలిపారు. ఈరోజు ప్రత్యేకంగా వాటి గురించి చెప్పలేదన్నారు. సిట్ విచారణ సంతృప్తికరంగా సాగుతోందన్నారు మాజీమంత్రి బాలినేని.