తెలంగాణ ఎన్నికల ప్రచారం హీట్‌ఎక్కుతోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పప్పు రాహుల్ గాంధీ అయితే తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి అని అన్నారు. రాహుల్ గాంధీ తన స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోవాలన్నారు మంత్రి కేటీఆర్ . టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ అని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాళేశ్వరం అవినీతిమయమని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు మంత్రి కేటీఆర్ . వీళ్లిద్దరు (రాహుల్, రేవంత్) ఎగేసుకొని కాళేశ్వరం చూద్దామని వెళ్లారని, ఇక వీళ్లు మహా ఇంజనీర్లు… అందుకే బ్రిడ్జి కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారని చురకలు అంటించారు. ఎక్స్‌పాక్షన్ జాయింట్‌ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుందని ఫోటోలు పెడుతున్నారని, ఇది వీళ్ల అవగాహన అని మండిపడ్డారు. రాష్ట్రానికి వరం కాళేశ్వరమైతే దేశానికి శనేశ్వరం కాంగ్రెస్ అన్నారు. రాహుల్ గాంధీకి చరిత్ర తెలవదని, తెలుసుకునే సోయి కూడా లేదన్నారు.
స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోవాలన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులే సోనియా గాంధీ అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ పార్టీ చేయని కుంభకోణమంటూ ఉందా? అన్నారు. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. ఆదర్శ్, బోఫోర్స్, కామన్‌వెల్త్, బొగ్గు ఇలా చెప్పుకుంటూ పోతే సహజ వనరులన్నీ దోచుకున్న దొంగలు అన్నారు. పంచ భూతాలను.. ఆకాశాన్ని, పాతాలన్ని మింగిన అవినీతి తిమింగలాలు అన్నారు మంత్రి కేటీఆర్ .