ఇప్పుడు ఇదంతా తమ ఘనతేనంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు : బండి సంజయ్‌

-

మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌. కరీంనగర్ పార్లమెంట్ నియోజకర్గ పరిధిలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణం కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అని.. ఇన్నేళ్లకైనా ఈ పనులకు శంకుస్థాపన చేయాలనుకోవడం స్వాగతించదగ్గ పరిణామమని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఆర్వోబీ మంజూరు తమ ఘనతేనంటూ నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు.. గత 8 ఏళ్లుగా పనులెందుకు చేపట్టలేదు? అని ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణ వ్యయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్‌. నయాపైసా కూడా కేటాయించకుండా ఇచ్చిన మాట తప్పిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు ఇదంతా తమ ఘనతేనంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు బండి సంజయ్‌.

TSPSC paper leak: SIT summons Bandi Sanjay on March 24

ఈ ఆర్వోబీ నిర్మాణం విషయంలో కేంద్రం ప్రభుత్వం మొదటి నుండి సానుకూలత వ్యక్తం చేస్తూ వస్తోందని.. తొలుత చేసుకున్న ఒప్పందం ప్రకారం 80 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం, 20 శాతం వాటా కేంద్రం చెల్లించేందుకు అంగీకరించిందని బండి సంజయ్ వివరించారు. నిధులు విడుదల చేయాలని తాను చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, లేఖలు రాసినా.. ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ఇదిగో అదిగో అంటూ జాప్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కాలం వెళ్లదీస్తూ వచ్చిందే తప్ప, నయాపైసా కూడా విడుదల చేయలేదన్నారు. చివరికి నిధులు విడుదల చేయమని చేతులు ఎత్తేయడంతో.. తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఆర్వోబీ నిర్మాణ వ్యయం మొత్తం 126 కోట్ల 74 లక్షల రూపాయలను కేంద్రమే భరించేలా ఒప్పించానని చెప్పారు. ఇందుకు 8 నెలల క్రితమే కేంద్రం ఆమోదం తెలిపినా, ఇప్పటిదాకా ఎందుకు పనులు ప్రారంభించలేకపోయారు? అని నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని.. సకాలంలో ఈ పనులు ప్రారంభించి, నిర్మాణాన్ని పూర్తి చేసి ఉంటే ఆ ప్రాణం బలయ్యేది కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే.. ఇన్నాళ్లూ జాప్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం వల్లే జాప్యం అయ్యిందంటూ నిందలేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్బోబీ కోసం తానెంతో కృషి చేశానని, అయితే తనకు సమాచారం ఇవ్వకుండా దీనికి శంకుస్థాపన చేస్తుండటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. ప్రతీది తమ ఘనతేనంటూ చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు.. వరంగల్-కరీంనగర్, ఎల్కతుర్తి-సిద్దిపేట, కరీంనగర్-జగిత్యాల రహదారి విస్తరణ పనుల కోసం 8 ఏళ్లుగా నిధులెందుకు సాధించలేకపోయారో సమాధానం చెప్పాలని అడిగారు. కరీంనగర్ ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసని, తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news