తెలంగాణలో ఒక్కసారిగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న రాత్రి టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ మారాలంటూ కొందరు ప్రలోభాలకు గురిచేయడం, నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా స్క్రిప్టు ప్రకారం జరిగిందని, కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడే దీనిని రాశారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎదురుదెబ్బ తగలడం ఖాయమని భావించి కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపారని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు స్వామీజీని పిలిపించుకుని మాట్లాడారని, అప్పుడే ఈ స్క్రిప్ట్ రాశారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ డ్రామాతో తమకు సంబంధం లేదని యాదాద్రిలో ప్రమాణం చేసే దమ్ము ఉందా? అని కేసీఆర్‌కు సవాలు చేశారు. యాదాద్రికి తమ తరపున ఎవరిని కోరితే వారే వస్తారని, టైం, తేదీ చెప్పాలని అన్నారు బండి సంజయ్.
ఈ వ్యవహారం మొత్తం ప్రగతి భవన్ వేదికగా నడిచిందని, సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో మంత్రిపై హత్యాయత్నం అంటూ ఆడిన డ్రామాలు విఫలం కావడంతో ఇప్పుడు మరో నాటకానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సీన్లను పోలీసులు ముందే రికార్డు చేసి పెట్టుకున్నారని అన్నారు బండి సంజయ్. ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌లో నాలుగు రోజుల సీసీటీవీ ఫుటేజీలతోపాటు ప్రగతి భవన్‌లోని ఫుటేజీలు బయటపెడితే సీఎం ఆడుతున్న డ్రామా బయటపడుతుందని అన్నారు బండి సంజయ్. మునుగోడుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడొకరు ప్రతి రోజూ ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లి రాత్రి వస్తున్నారని అన్నారు బండి సంజయ్.