హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీ-ఓపెన్ చేయాల్సిందే – బండి సంజయ్‌

-

హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసులను తక్షణమే రీ ఓపెన్ చేసి విచారణను వేగవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ డిమాండ్ చేశారు. ఈ కేసులు కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని అన్నారు. ఈ కేసును వెంటనే రీఓపెన్ చేసి విచారణ జరిపి దోషులను నడిబజార్లో నిలబెట్టాలని దర్యాప్తు సంస్థలను కోరారు. ఎమ్మెల్సీ కవిత రేపు జరగబోయే సీబీఐ విచారణకు హాజరుకావడం లేదని చెప్పడంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

‘‘లక్ష కోట్లతో లిక్కర్ దందా చేసిన కేసీఆర్ బిడ్డ విచారణకు పోతే సీబీఐ అరెస్టు చేస్తుందనే భయం పట్టుకుంది. అందుకే తండ్రీబిడ్డలు కూర్చుని ఒకళ్లను పట్టుకుని ఒకళ్లు ఏడుస్తున్నరు. అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి కొత్త డ్రామాలు స్టార్ట్ చేశారు. ఒకవేళ అరెస్ట్ అయితే సానుభూతి కోసం స్కెచ్ వేస్తున్నరు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తున్నరు. తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలే. లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తే మీరెందుకు ధర్నాలు చేయాలే’’అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కుట్ర చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందట… కేసీఆర్…ఎందుకీ అర్ధం పర్ధం లేని మాటలు? బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే. నీ ప్రభుత్వాన్ని కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలి. కూల్చడం సాధ్యమా? అయినా నీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేందుకు? తెలంగాణ ప్రజల ఆశలను కూల్చింది నువ్వే. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చినవ్…తెలంగాణ ప్రజలే నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధమైనరు‘‘అని ఘుటుగా వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన కంత్రీ మంత్రికి సంబంధించి అవినీతి, అక్రమాలు, భూకబ్జాల చిట్టా తనవద్ద ఉందని… పిచ్చపిచ్చగా మాట్లాడితే అంతు చూస్తామని హెచ్చరించారు. చలాన్ల పేరుతో నిర్మల్ పోలీసులు రోజుకు లక్ష రూపాయలు వసూలు చేయాలని మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో 8వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న కనకాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.

Read more RELATED
Recommended to you

Latest news