తెలంగాణలో ఖాకీలకు, కాషాయ పార్టీకి అస్సలు పడట్లేదు. పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా… దానిపై సైబరాబాద్ సీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించడం… దానికి రాజాసింగ్ మరోసారి ధీటుగా బదులివ్వడం.. చూస్తుంటే పరిస్థితి ఖాకీ వర్సెస్ కాషాయం అన్నట్టుగా మారినట్టు కనిపిస్తోంది.అయితే మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నా నేతలు ఇద్దరు ఈ వివాదంతో కలిసిపోవడం కమలదళంలో కొత్త జోష్ తీసుకొచ్చింది.
దుబ్బాక ఉప ఎన్నిక నుంచి మొదలైన బీజేపీ వర్సెస్ పోలీసులు ఎపిసోడ్… కొనసాగుతూనే ఉంది. విషయం ఏదైనా.. ఖాకీలకు, కాషాయ పార్టీలకు మధ్య రచ్చ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. పోలీసులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమైంది.
ఇటీవల గోవులను తరలిస్తున్న ఒక ట్రక్కును చౌటుప్పల్ దగ్గర రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న రాజాసింగ్.. ఆ సందర్భంగా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. కొందరు పోలీసులు బ్రోకర్లుగా మారిపోయారని… డబ్బులకు కక్కుర్తి పడి ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపణలు చేశారు. అంతేకాదు, పోలీసులకు జీతాలు సరిపోకపోతే.. తాము భిక్షం ఎత్తుకొనైనా ఇస్తామని చెప్పారు. అధికారులు స్పందించకపోతే తామే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు రాజాసింగ్.
పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రతిఒక్కరికీ ఫ్యాషనైపోయిందంటూ.. మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల్ని సీపీ తప్పుబట్టారు. పోలీసులపై అనవసర ఆరోపణలు తగ్గదనీ… ఇష్టారాజ్యంగా మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల నైతికత దెబ్బతినేలా ఎవరు మాట్లాడినా చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు సజ్జనార్.
పోలీసులతో రాజాసింగ్ మాటలయుద్ధం జరుగుతుండగా.. రాజాసింగ్ కి బాసటగా నిలిచారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో గోవధపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ల కోసం కొంత మంది పోలీసు అధికారులు సీఎం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదన్న సంజయ్.. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న వారిపైనే తమ పోరాటమని చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో ఎమ్మెల్యే రాజాసింగ్ కి విభేదాలు తలెత్తాయి.గోషామహల్ టిక్కెట్ల విషయంలో ఎమ్మెల్యేని పరిగణలోకి తీసుకోకుండా బీఫారాలు ఇచ్చారంటూ సంజయ్ పై ఫైరయ్యారు ఎమ్మెల్యే రాజాసింగ్.ప్రచారంలోను సంజయ్ తో కలిసి ఎక్కడా పాల్గొనలేదు.తాజాగా రాజాసింగ్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.