చాలా మంది వాహనదారులు సిగ్నల్ జంప్ చేస్తూ, చలానాలు కట్టకుండా తప్పించుకుంటూ, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ.. ఇలా రకరకాల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడు. కానీ అందరిలా లైట్ తీసుకోలేదు. అత్యవసర పరిస్థితుల్లో అయినా.. తాను చేసింది తప్పే అని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే..
“ప్రియమైన బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులారా.. శాంతినగర్ బస్టాండ్ దగ్గర నిన్న పొరపాటున ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశా. నేను స్వచ్ఛందంగా ఫైన్ కట్టేయొచ్చా?” అంటూ పోలీసులకు ఓ వ్యక్తి చేసిన ట్వీట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్ట్‌కు పోలీసులు ఇచ్చిన జవాబు కూడా చర్చనీయాంశమైంది.
బాలకృష్ణ బిర్లా అనే వ్యక్తి బెంగళూరులో ఉంటారు. ఏదో పనిపై ఈనెల 27న తన వాహనంలో బయటకు వెళ్లారు. హడావుడిలో చూసుకోకుండా శాంతినగర్ బస్టాండ్ దగ్గర సిగ్నల్ జంప్ చేశారు. కానీ.. తప్పు చేశానన్న భావన ఆయన్ను వెంటాడింది. ఇంటికి వచ్చినా ప్రశాంతత లేదు. అందుకే ఈ నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నారు బాలకృష్ణ బిర్లా.
Dear @blrcitytraffic,
I broke a traffic signal near Shanti Nagar Bus Stand by mistake yesterday.
Can I pay my fine proactively?
— Bal Krishn Birla (@bkbirla) September 28, 2022
బుధవారం బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల అధికారిక హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు బాలకృష్ణ. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ నేరానికి పాల్పడినందుకు స్వచ్ఛందంగా జరిమానా కట్టేస్తానని ముందుకొచ్చారు. గురువారం ఉదయం ఈ బిర్లా ట్వీట్‌కు స్పందించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. “చలానా వచ్చాక మీరు ఫైన్ కట్టేయొచ్చు” అని రిప్లై ఇచ్చారు.
After getting a traffic rule violation notice you can pay the fine.
— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) September 29, 2022