ప్రస్తుత తరుణంలో అనేక బ్యాంకులు డెబిట్ కార్డు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్న విషయం విదితమే. వినియోగదారులు తమ డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన మొత్తాలు ఒక నిర్దిష్ట మొత్తం దాటితే దాన్ని ఈఎంఐ కింద మార్చుకోవచ్చు. వివిధ రకాల బ్యాంకుల నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ నిర్దిష్టమైన మొత్తం మారుతుంది. అయితే ఎస్‌బీఐ కూడా డెబిట్ కార్డు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ వినియోగదారులందరికీ అందుబాటులో ఉండదు. కొందరు ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే తమకు ఈ సదుపాయం అందుబాటులో ఉందా, లేదా ? అని ముందుగా తెలుసుకోవాలి. అందుకు గాను DCEMI అని టైప్ చేసి 567676 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. దీంతో అర్హులైతే వెంటనే మెసేజ్ వస్తుంది. అందులో క్రెడిట్ లిమిట్ కూడా ఇస్తారు. ఈ విధంగా ఎస్బీఐ వినియోగదారులు తాము డెబిట్ కార్డు ఈఎంఐకి అర్హులు అవునో, కారో సులభంగా తెలుసుకోవచ్చు.
అయితే ఆన్‌లైన్‌లో ప్రతి వస్తువును డెబిట్ కార్డు ఈఎంఐ ద్వారా కొనలేరు. కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. కనుక ప్రొడక్ట్ పేజీలో పేమెంట్ ఆప్షన్లలో డెబిట్ కార్డు ఈఎంఐ ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. ఉంటే ఆ ప్రొడక్ట్ ను కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసే సమయంలో మీకు కావల్సినన్ని నెలల పాటు అందులో సూచించిన విధంగా ఈఎంఐ పెట్టుకోవచ్చు. దీంతో పేమెంట్ జరిగిపోతుంది.
ఇక మర్చంట్ దగ్గర.. అంటే స్టోర్‌లలో ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ ద్వారా వస్తువులను కొనాలంటే అక్కడ ఈ సదుపాయం ఉందో లేదో అడగాలి. ఉంటే.. పీవోఎస్ మెషిన్‌లో షాపు వారు బ్యాంకు పేరు ఎంచుకుని తరువాత అందులో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఈఎంఐని సెలెక్ట్ చేస్తారు. అక్కడ కార్డును స్వైప్ చేయాలి. దీంతో ఎంపిక చేసిన ప్రకారం ఈఎంఐలు సెలెక్ట్ చేయబడతాయి. పేమెంట్ అవుతుంది. తరువాత వస్తువును కొంటారు. అందుకు అనుగుణంగా ఈఎంఐలను చెల్లించాలి.
ఇక డెబిట్ కార్డు ఈఎంఐ ఉంటే అనేక ఈ-కామర్స్ స్టోర్‌లలో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సైట్లలో డెబిట్ కార్డు ఈఎంఐ ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఈవిధంగా ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఈఎంఐని ఉపయోగించుకోవచ్చు. అయితే లోన్ మొత్తం కనీసం రూ.8000 ఉండాలి. గరిష్టంగా రూ.1 లక్ష వరకు ఈవిధంగా ఈఎంఐతో కొనవచ్చు. 7.50 నుంచి 14.70 శాతం వరకు వడ్డీని ఇందుకు వసూలు చేస్తారు. ఈఎంఐ గడువులు సాధారణంగా 6, 9, 12, 18 నెలల వరకు ఉంటాయి.