బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల జాబితాను ఈ నెల 22న ప్రకటిస్తామని ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాల జాబితా ప్రకటన జాప్యమవుతోందని విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యాజమాన్యం స్పందించింది. వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి స్పందిస్తూ ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
‘‘ఈ ఏడాది సైతం 1500 సీట్లు భర్తీ చేస్తాం. ఇందులో ప్రత్యేక కేటగిరి కింద 96 సీట్లు పోగా మిగిలిన 1404లో 702 సీట్లు వివిధ రిజర్వేషన్లకు కేటాయిస్తాం. జనరల్‌కు మిగిలిన 702లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 140 సీట్లు కేటాయిస్తాం. దీంతోపాటు 30 ఎన్‌ఆర్‌ఐ సీట్లు, 75 గ్లోబల్ సీట్లు అందుబాటులో ఉంటాయి’’ అని వెంకటరమణ వెల్లడించారు.