రాజ్‌ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణకే తలమానికమైన బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ భవన్ లో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. రంగు రంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో సందడి చేశారు. తర్వాత బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. పూల పండుగ సందర్భంగా రాజ్ భవన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డప్పు కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పండుగ బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి మొదలైయ్యాయి. పెత్రమాస నాడు ఎంగిలి పూల బతుకమ్మగా కొలువుదీరే ఈ పూల పండుగ… సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. రంగురంగుల పూలు.. చుట్టూ చేరి మహిళలు కొట్టే చప్పట్లు.. ఎంగిలి పూలతో మెుదలు తొమ్మిది రోజులు.. తీరొక్క రుచులతో నైవేధ్యాలు.. ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయే చందమామ అంటూ ఆడపడుచులు పాడే పాటలు.. అన్నీ కలగలిపి తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేలా సంబురాలు జరుగుతాయి.

9 రోజులు.. 9 రకాలుగా ఈ వేడుకలు జరుగుతాయి. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్యతో ప్రారంభమవుతుంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడతారు. ఇలా తొలి రోజున పేర్చిన బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’గా పిలుస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నన్ను బియ్యం బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆఖరుగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా వేడుకలు నిర్వహిస్తారు.