సరిగ్గా శరన్నవరాత్రుల ప్రారంభానికి ఒక్కరోజు ముందే బతుకమ్మ ప్రారంభం అవుతుంది. బతుకమ్మలో ఆరాధించేది ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మనే. నవరాత్రుల్లో ఆరాధించేది శక్తి స్వరూపిణి అమ్మనే. ఆయా సంప్రదాయాల ప్రకారం అమ్మకు ఆయా పేర్లు పెట్టుకుని ఆరాధిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారిని నవదుర్గలుగా ఆయా పేర్లతో అలంకరించి పూజిస్తారు. సరిగ్గా బతుకమ్మలో కూడా రోజుకొక్క పేరుతో అలంకారంతో బతుకమ్మను ఆరాధిస్తారు. వేదోచ్ఛరణలు చేసి నవరాత్రులు చేస్తే ఇక్కడ రకరకాల నాదోపాసన అదేనండి జానపద గేయాలతో తన్మయత్వంతో భక్తి, శ్రద్ధలతో బతుకమ్మను ఆరాధిస్తారు.
అంటే అమ్మను ఆశ్వీజంలో ఆరాధించడమే ఇక్కడ ప్రధానంగా కన్పిస్తుంది. అందరూ వేదోక్త విధానంలో అమ్మవారి అర్చన సాధ్యం కాదనే ఈ రూపకంగా అమ్మను ఆరాధించడానికి మన పూర్వీకుల నెలకొల్పిన పండుగ బతుకమ్మ అనడంలో అతిశయోక్తి లేదు. దీనికి ఒక ఉదాహరణ శ్రీవిద్యలో/వేద విద్యలోని బీజాక్షరాలను అందరూ పలకడం సాధ్యం కాదు.
తప్పు పలికితే చెడు ఫలితాలు వస్తాయి అనేది శాస్త్ర ప్రవచనం. అందుకే తెలంగాణ సహజకవి పోతన తన భాగవత పీఠికలో రాసిన పద్యాన్ని సామాన్యులు శ్రీవిద్యోపాసన చేసేలా, శుచి, శుభ్రత ఎటువంటి నియమాలు లేకుండా ఆరాధించేలా ఆయన రాసిన పద్యం అమ్మలగన్నయమ్మ. మాయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ పద్యం. సరిగ్గా శ్రీవిద్యోపాసకులు చేసే నవరాత్రులు, అందరూ ఆడే బతుకమ్మలోని అమ్మ ఆరాధన దాదాపు సమానంగా ఉంటాయి.
– కేశవ