బెంగాల్ సంచ‌ల‌నంః రోజువారీ కూలీ.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే

-

రెక్కాడితే గానీ డొక్కాడ‌ని కుటుంబం. భ‌ర్త రోజు వారీ కూలీ ప‌నిచేసే మేస్త్రీ. నాలుగు క‌మ్మ‌ల‌తో వేసిన గుడిసె. మూడు మేక‌లు, మూడు ఆవులు ఇవే ఆమె ఆస్తులు. కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంటున్న బీజేపీ ఎమ్మెల్యే. ఏంటి ఎమ్మెల్యేనా అనుకుంటున్నారా.. అవునండి ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెనే చంద‌నా బౌరి.

వెస్ట్ బెంగాల్ లోని ఓ మారుమూల గ్రామంలో ఉంటున్న ఆమె.. ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. క‌ల‌లోనైనా సాధ్యం కాని ప‌నిని ఆమె చేసి చూపించారు. ఒక సాధార‌ణ కూలీగా ఉన్న ఆమెకు మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో స‌ల్తోరా నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. దీంతో ఆమె ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయిపోయారు. అంతే కాదండోయ్‌.. మ‌మ‌త గాలిని త‌ట్టుకోలేక మ‌హామ‌హులే మ‌ట్టి క‌రిస్తే… ఆమె మాత్రం విజ‌య‌ఢంకా మోగించారు. ప్ర‌త్య‌ర్థి టీఎంసీ అభ్య‌ర్థి సంతోష్ కుమార్ మండ‌ల్‌పై ఏకంగా 4వేల ఓట్ల మెజార్టీతో గెలిచి మొద‌టిసారి ఎమ్మెల్యే అయ్యారు.

తన పేరిట రూ.31,985, తన భర్త పేరిట రూ. 30,311 మాత్ర‌మే ఆస్తులున్నాయ‌ని ఆమె తెలిపింది. వీటితోనే ఎల‌క్ష‌న్ల‌లో పోటీ చేసి గెలిచారు. ఎస్సీ మహిళ అయిన చందనా.. ఇప్పుడు రోల్ మోడ‌ల్ గా నిలిచింది.
ముగ్గురు పిల్లలకు తల్లి అయిన చందన.. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది. త‌న‌కు టికెట్ వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేద‌ని, త‌నకు మ‌ద్ద‌తుగా చాలామంది స్వ‌తంత్రంగా ముందుకు వ‌చ్చార‌ని తెలిపింది. గ‌త రెండు సార్లు టీఎంసీ గెలుస్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె గెలిచి ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు ఆమెపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఆమె ఎంతో మందికి ఆద‌ర్శం అని కొనియాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version