రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా మళ్లీ తానే పోటీచేస్తానని భరత్ రామ్ అన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి తెదేపా ప్రభుత్వం తీసుకున్న లోపభూయిష్ట విధానాలే కారణమన్నారు. వేమగిరి-సామర్లకోట రహదారి విస్తరణ పనులకు రూ.470 కోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇప్పటి వరకు 5 చోట్ల పై వంతెనలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపగా మోరంపూడిపై వంతెనకు ఈ నెల 22న భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
ఏడు నియోజకవర్గాల అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని భరత్ రామ్ తెలిపారు. వేమగిరి నుంచి పొట్టిలంక వరకు సర్వీసు రోడ్డుకు అనుమతులు లభించాయని, రాజానగరం నుంచి పొట్టిలంక వరకు రూ.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కడియం, ధవళేశ్వరంలో రైతుబజార్ ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయని వాటి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కడియం మండలంలో వేమగిరి, దామిరెడ్డిపల్లి, వీరవరం వెళ్లే ప్రధాన రహదారుల అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేశామని తెలిపారు.