లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన భూపాలపల్లి ఎస్సై

-

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం ఎస్సై ఇస్లావత్‌ నరేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు నరేశ్ నుంచి రూ.25వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఠాణాకు తీసుకెళ్లి విచారించారు. ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

అసలేం జరిగిందంటే.. కరీంనగర్‌కు చెందిన ఉదయ్‌శంకర్‌ భూపాలపల్లి పట్టణంలో ఏసీల వ్యాపారం చేస్తున్నాడు. ఆయన కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దగ్గర కొన్ని నెలల కిందట రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అవి సకాలంలో చెల్లించకుండా వాయిదాలు వేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బాధితుడు భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించాలని ఎస్సై నరేశ్.. ఉదయ్‌శంకర్‌కు సూచించారు. వ్యాపారం నష్టాల్లో ఉందని.. వడ్డీ చెల్లిస్తూ అసలు తర్వాత ఇస్తానని చెబుతూ వచ్చారు. అయినా ఎస్సై ససేమిరా అంటూ వారం రోజులుగా ఫోన్‌ చేస్తున్నారు. తనకు రూ.75 వేలు ఇస్తే ఒత్తిడి చేయనంటూ బేరసారాలకు దిగారు. దీంతో ముందుగా రూ.25 వేలు చెల్లిస్తానని ఉదయ్‌శంకర్‌ ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను సంప్రదించారు.

వారు చెప్పినట్లుగా..గురువారం మధ్యాహ్నం రూ.25 వేలు తీసుకొని పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో ఎస్సై లేకపోవడంతో ఫోన్‌ చేయగా ఇంటికే రమ్మని చెప్పారు. వెంటనే ఇంటికెళ్లి డబ్బులు అతని చేతిలో పెట్టారు. అప్పటికే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు నేరుగా ఎస్సై నరేశ్ ను పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news