ఈటల రాజేందర్ ఈ నెల 14న అంటే రేపు.. బీజేపీలో చేరనున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈటల సహా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కూడా కాషాయం జెండా కప్పుకోనున్నారు. అయితే ఈ తరుణంలో బిజేపి ఢిల్లీ పెద్దలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు షాక్ ఇచ్చారు. అదేంటి బిజేపి లో చేరకముందే.. షాక్ ఏంటి అనుకుంటున్నారా.. అవును నిజమే. బిజేపిలో చేరకముందే ఈటలకు షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. బిజేపిలో చేరే నేపథ్యంలో 80 మందికి అపాయింట్ మెంట్ ఈటల అడిగారు. అయితే కోవిడ్ నేపథ్యంలో బీజేపీ పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో రెండు ఫ్లైట్ లలో వెళ్లాలని అనుకున్నా… అపాయింట్ మెంట్ ఇవ్వక పోవడంతో కొద్దీ మందితోనే ఢిల్లీకి వెళ్లనున్నారు ఈటల రాజేందర్.
అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో ఒక ఫ్లైట్ ను రద్దు చేసుకున్నారు నేతలు. ఇక రేపు ఉదయం స్పెషల్ ఫ్లైట్ లో సహచరులతో ఈటల ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా ఈటల రాజేందర్ రాజీనామాకు నిన్న ఆమోదం ముద్ర పడింది. ఈటల రాజీనామాను తెలంగాణ స్పీకర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. హుజురాబాద్ నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ఇటీవలే భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ బర్తరఫ్ చేయడంతో.. టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.