వైఎస్ హ‌త్య‌.. ఆ పార్టీ ఎమ్మెల్సీ మెడ‌కు చుట్టుకోనుందా..!

-

వైఎస్ హ‌త్య ఇప్పుడు ఎవ‌రి మెడ‌కు చుట్టుకోబోతుందో అంతు చిక్క‌డం లేదు. సిట్ త‌మ ప‌నిని చాప‌కింద నీరులా సాగించుకుంటూ పోతుంది.. అయితే సిట్ చేస్తున్న విచార‌ణ ఇప్పుడు రాజ‌కీయ వేడిని రాజేసేలా ఉంది. వైఎస్ హ‌త్య ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ మెడ‌కు చుట్టుకోబోతుందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే సిట్ ఇప్పుడు వైఎస్ హ‌త్య‌ను ఛేదించే క్ర‌మంలో ప‌లువురికి నోటీసులు పంపుతుండ‌టంతో ఆ పార్టీ నేత‌ల గుండెల్లో రైళ్ళు ప‌రుగెడుతున్నాయి.

అయితే ఇప్పుడు వైఎస్ హ‌త్య‌ను సిట్ చేస్తున్న ద‌ర్యాప్తులో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వికి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేయ‌డంతో టీడీపీ నేత‌ల గుండెల్లో గుబులు మొద‌లైంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి ఈ ఏడాది మార్చి 14న హ‌త్య‌కు గుర‌య్యారు. అయితే టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన ఈ హ‌త్య‌పై ఎలాంటి విచార‌ణ జ‌రుప‌క‌పోవ‌డంతో హ‌త్య‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. టీడీపీ ప్ర‌భుత్వం నామ‌మాత్రంగా సిట్ ఏర్పాటు చేసిన‌ప్ప‌టికి దానిపై వైఎస్ కుటుంబ స‌భ్యులు అనుమానాలు వ్య‌క్తం చేశారు.

ఇంత‌లో ఏపీలో అధికార బ‌ద‌లాయింపు జ‌ర‌గ‌డంతో సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత వైఎస్ వివేకా హ‌త్య‌పై సిట్‌ను ఏర్పాటు చేశారు. గ‌త నాలుగు నెలలుగా జరుగుతున్న సిట్ బృందం విచారణ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. మరో వారం రోజులపాటు విచారించి అనంతరం వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.

కడప జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో సిట్ బృందం పలువురిని విచారిస్తోంది. ఈ కేసులో వైయస్ వివేకానందరెడ్డి సోదరులు, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారించారు. ఇకపోతే బుధవారం కూడా మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి కారు డ్రైవర్ దస్తగిరితోపాటు ప్రకాష్ అనే వ్యక్తిని సిట్ బృందం విచారించింది. అనంతరం బుధవారం స్థానిక టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవికి నోటీసులు జారీ చేసింది.

గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులో పేర్కొంది సిట్ దర్యాప్తు బృందం. బీటెక్ రవికి నోటీసులు జారీ చేయడంపై కడప జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీటెక్ రవి ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. బీటెక్ రవి విచారణ అనంతరం మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిని సైతం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డిపై వైయస్ కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో అనుమానితులుగా ఉన్న పలువురికి ఇప్పటికే నార్కో అనాలిసిస్ టెస్టులు కూడా నిర్వహించింది. ఇకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసుల రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సిట్ వేగంగా జ‌రుపుతున్న విచార‌ణ‌లో ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి విచార‌ణ‌కు హాజ‌రైతే త‌రువాత జ‌రిగే ప‌రిణామాలు ఏమిటో అంతు చిక్క‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news