దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వచ్చేస్తోంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను కేంద్రం ముందుగానే నిర్వహించబోతోందనే అంచనాలు విపక్షాల్లో పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సంకేతాలుకూడా వచ్చాయని విపక్ష పార్టీలు చెప్తున్నాయి. దేశంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పార్లమెంటు ఎన్నికలు రావొచ్చని అన్నారు. వాస్తవానికి 2024లో లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉందని, కానీ షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశముందని తెలిపారు.
“ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుపుతారన్న గ్యారెంటీ లేదు… ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చు” అని వివరించారు. ముందస్తు ఎన్నికలపై నితీశ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. జూన్ లో విపక్షాల సమావేశానికి ముందు కూడా ఎన్నికలపై స్పందించారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలుసు? ఎన్నికలు వచ్చే ఏడాదే నిర్వహించాలని లేదు అని వ్యాఖ్యానించారు. అటు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరుపుతుందని నాకు అనుమానంగా ఉంది అని ఆమె తెలిపారు. ఒకవేళ డిసెంబరు కాకపోతే జనవరిలో జరపొచ్చు అని పేర్కొన్నారు.