ఇటీవల బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదురిన సంగతి తెలిసిందే. విజయవాడలో గురువారం నిర్వహించిన సంయుక్త భేటీలో ఇరు పార్టీల నేతలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందన్న పవన్.. ఏపీ భవిష్యత్తు కోసం ఆ పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. ఇక తాజాగా మరోసారి విజయవాడలో బీజేపీ, జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఏపీలో చోటు చేసుకుంటోన్న తాజా రాజకీయ పరిణామలు, తమ కార్యచరణ ప్రణాళికపై నేతలు చర్చించనున్నారు. బీజేపీ నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంత రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
అలాగే, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శివశంకర్, కందుల దుర్గేశ్, చిలకం మధుసూదన రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు. మరోవైపు, విజయవాడలోనే తమ పార్టీ కార్యాలయంలో నిన్న జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న సమావేశమై రాజధాని అంశంపై చర్చించారు. రాజధాని రైతుల తరఫున పోరాడతామని ఇప్పటికే బీజేపీ, జనసేన ప్రకటించాయి. ఈ రోజు భేటీలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.