మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జరిగిన హత్య తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఈ కేసులో ఇప్పటివరకు హత్య కేసు నిందితులు ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియలేదు. హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పై ఎన్నో విమర్శలు వచ్చాయి.
ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హత్య కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అయితే ఆ తర్వాత దానిపై సీబీఐ విచారణ చేపట్టాలని అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చినా, ఈ కేసులో ఎటువంటి ముందడుగు పడలేదు. దీనికితోడు తెలుగుదేశం పార్టీ నేతలను బీజేపీ నేతలను, సిట్ బృందం ప్రత్యేకంగా విచారించడం ఆశ్చర్యం కలిగించింది.
ఇక ఈ తరుణంలో వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ హత్యా కేసుని సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, హత్య కేసు విచారణ తుది దశకు చేరుకున్న ఈ తరుణంలో అసలు సీబీఐ విచారణ అనేది అవసరం లేదని కోర్ట్ కి స్పష్టం చేసింది. తాజాగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత హైకోర్టులో తన తండ్రి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ పిటీషన్ దాఖలు చేసారు. దీనితో ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.