పట్టభద్రుల స్థానంలో పట్టు బిగిస్తున్న బీజేపీ

-

తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనికి తోడు వరుస ఎన్నికలు జరుగుతుండటంతో.. ఆ వేడి మరింత పెరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలే కాకుండా రాబోయే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక..ఆ తర్వాత జరిగే కార్పొరేషన్‌ ఎన్నికలు ముగిసే వరకు ఈ హీటు తగ్గేలా కనిపించడం లేదు. నిరుద్యోగ సమస్యలు,కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతుంది బీజేపీ.

తెలంగాణలో దుబ్బాక,గ్రేటర్ ఫలితాలు ఇచ్చిన ఊపుతో క్రమంగా తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మరోసారి రామచంద్రరావునే బరిలో నిలిపింది బీజేపీ. గతంలో అనూహ్య విజయం సాధించిన ఆయన.. మరోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇటీవల బీజేపీకి వచ్చిన అనుకూల ఫలితాలే.. ఇక్కడా రిపీటవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ స్థానం నుంచి గ్యాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణిదేవిని రంగంలోకి దింపింది టీఆర్‌ఎస్‌ పార్టీ. గతంలో ఈ స్థానాన్ని కోల్పోయిన అధికార పార్టీ..ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉంది. ఆ దిశగానే పావులు కదుపుతోంది. ఓడిపోయే సీటును పీవీ కుమార్తెకు ఇచ్చారన్న బీజేపీ ఓట్లు చీల్చేందుకే వాణీ దేవికి టికెట్ అంటూ ఆరోపిస్తుంది. ఓడిపోతామని తెలుసు కాబట్టే వాణీ దేవికి టికెట్ ఇచ్చిందని పీవీ మనవడు సుభాష్‌ సైతం ఆరోపించారు. పీవీ కుటుంబంపై ప్రేమ ఉంటే చాలా కార్పొరేషన్ పదవులు ఉన్నాయని గుర్తు చేశారు.

అటు ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి కూడా బలమైన అభ్యర్థులే బరిలో ఉన్నా.. ప్రధానమైన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోసారి తమదే గెలుపంటూ ప్రచారంలో దూకుడు పెంచింది టీఆర్ఎస్. అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సమన్వయంతో ప్రచారం చేస్తున్నారు.ఇక బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపుపై ధీమాతో ఉన్నారు.

పల్లాని గతంలో గెలిపించినా మూడు జిల్లాల పరిధిలో ఒరగబెట్టింది ఏమి లేదని కేసీఆర్ చుట్టు తిరుగుతు డబ్బు మూటలు కూడబెట్టారని ఆరోపిస్తుంది బీజేపీ. నిరుద్యోగుల సమస్యలే ప్రచారస్త్రంగా ప్రచారంలో దూసుకుపోతుంది. హైదరాబాద్-రంగరెడ్డి-మహబూబ్ నగర్ పరిధిలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మధ్యే పోటి నెలకొంది. గ్రేటర్ పరిథిలో బీజేపీ పటిష్టంగా ఉండటం మహబూబ్ నగర్ లో బీజేపీ సీనియర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రామచంద్రరావు గెలుపు నల్లేరు పై నడకే అన్న చర్చ పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news