పోలింగ్‌ తర్వాత బీజేపీలో భిన్నవాదనలు !

-

ఈసారి గ్రేటర్‌లో పోలింగ్‌ శాతం పెరుగుతుందని బీజేపీ నేతలు చాలా ఆశించారు. పోలింగ్‌ శాతం పెరిగితే తమకు లాభిస్తుందని అనుకున్నారు. కానీ.. పోలింగ్‌ తర్వాత బీజేపీలో భిన్న వాదనలు ఉన్నాయి. పోలింగ్‌ తగ్గడం వెనక అధికారపార్టీ బెదిరింపులే కారణమని ఓటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఆరోపించారు.

ఈసారి పాతబస్తీలో బలం పెంచుకుంటామన్న ధీమాతో ఉన్నారు బీజేపీ నాయకులు. అలాగే కొన్ని టీఆర్ఎస్‌ సిట్టింగ్‌ స్థానాల్లోనూ విజయం తమదే అన్న లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్‌ రోజు జరిగిన ఘర్షణలు.. తోపులాటలు ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. డివిజన్ల వారీగా పోలైన ఓట్లను దగ్గర పెట్టుకుని అదే పనిగా కూడికలు, తీసివేతలు..గుణకారాలులతో బిజీబీజీగా ఉన్నారు నాయకులు. పోలింగ్‌ శాతం ఆశించినస్థాయిలో లేకపోయినా.. గల్లీస్థాయి నుంచి కార్యకర్తలు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ చూసిన తర్వాత బీజేపీ నేతలు కొంత తేరుకున్నట్టే కనిపిస్తోంది.

ముఖ్యంగా పాతబస్తీలో దాదాపు 38 డివిజన్లలో పోలింగ్‌ శాతం పెరగడంతో అది తమకే కలిసివస్తుందని అనుకుంటున్నారు. అలాగే నగర శివారు ప్రాంతాల్లోనూ కమలం పట్ల సానుకూలత కనిపించిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న 4 సీట్లు దాదాపు 10 రెట్లు పెరుగుతాయన్నది కొందరు బీజేపీ నాయకులు చెబుతున్న మాట. ఒకవేళ గాలి వీస్తే మాత్రం అది 60 దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే కాంగ్రెస్‌ లెక్కలు మరోలా ఉన్నాయి. పోలింగ్ శాతం అనుకున్నదానికంటే తక్కువ నమోదు కావడంపై కాంగ్రెస్ నాయకులు కొంత ఆశలు పెట్టుకున్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు రాలేదంటే.. అధికార పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయంతో ఉంది కాంగ్రెస్. హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ తారాస్థాయిలో ప్రచారం చేసినా.. జనం మాత్రం కాషాయానికి అంత సానుకూలంగా ఓటేస్తారని కాంగ్రెస్ నాయకులు భావించడం లేదు.

ఇక ఓల్డ్‌ సిటీ నుంచి క్రమంగా న్యూ సిటీ వైపు బలం పెంచుకుంటూ వెళ్తోన్న మజ్లిస్‌ పార్టీ.. ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. గత ఎన్నికల్లో MIMకు 44 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 51 డివిజన్లలో పోటీ చేసింది. మరి ప్రస్తుతం హోరాహోరీగా సాగిన పోరులో మజ్లిస్‌ గాలిపటం ఎన్ని ప్రాంతాల్లో ఎగురుతుందో చూడాలి. తెలంగాణలో ఉనికి కోసం పరితపిస్తున్న టీడీపీ ఏకంగా 106 డివిజన్లలో పోటీ చేసింది. ప్రచారంలో టీడీపీ సందడి లేకపోయినా.. తెలుగు తమ్ముళ్లు సైతం కొన్ని లెక్కలు వేసుకుంటున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఒక్క డివిజన్‌లోనే గెలిచింది. ఇప్పుడు సైకిల్‌ బోణీ కొడుతుందో లేదో డిసెంబర్‌ 4న వెల్లడయ్యే ఫలితాలు తేల్చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news