రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీనే పోటీ అని అన్నారు వివేక్ వెంకటస్వామి . ఎన్నికల సమయంలో అధ్యక్షుడిని ఎవరూ కూడా మార్చబోరని అన్నారు. అధ్యక్షుడి మార్పు విపక్షాల అపోహలు మాత్రమేనని కొట్టి పడేశారు. కొందరు పని గట్టుకుని బీజేపీ అధ్యక్ష మార్పుపై పుకార్లు పుట్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ నేతృత్వంలో అందరం ఐక్యంగా ఐక్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని అధ్యక్షుడి మార్పు చేయాల్సిన అవసరం లేదన్నారు.
పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న బోనాలు, పట్నాల వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదాల గ్రామానికి చెందిన బీజేపీ లీడర్ చిట్టవేణి హరీశ్ తల్లి లక్ష్మి ఇటీవల చనిపోయారు. వారి కుటుంబాన్ని వివేక్ పరామర్శించారు. ఎలిగేడు మండలం ధూలికట్ట గ్రామానికి చెందిన బాలసాని రామస్వామి ఇటీవల చనిపోగా వారి కొడుకులు కొమురయ్య, పరుశురాంలను పరామర్శించారు.