బెంగాల్ సర్కార్ అవినీతికి పాల్పడుతోందని ప్రతిపక్ష బీజేపీ నబానా చలో మార్చ్ చేపట్టింది. ఈ ఆందోళన కొద్దిసేపటికే ఉద్రిక్తంగా మారింది. సచివాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన మెగా ర్యాలీని బెంగాల్ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొన్నారు.
ఈ క్రమంలోనే పలు చోట్ల పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. దీంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పలువురు నేతలను అరెస్టు చేశారు. కోల్కతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతోన్న ప్రతిపక్ష నేత సువేందు అధికారి, మరో నేత లాకెట్ ఛటర్జీని మార్గమధ్యంలో అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రజల మద్దతు లేదని, అయినప్పటికీ ఆమె ఉత్తరకొరియా నియంత కిమ్లా పాలన చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని.. అప్పుడు టీఎంసీ నేతలు, పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.