పొత్తు పేరుతో కత్తులు దూస్తున్న జనసేన,బీజేపీ నేతలను గాడినపెట్టే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. రెండు పార్టీల మధ్య వచ్చిన గ్యాప్ పూడ్చాలనుకున్నారో లేక.. ఢిల్లీ పెద్దలు గైడ్ చేశారో బీజేపీ నేతలు పవన్ ఇంటికి క్యూ కడుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటున్న రెండు పార్టీల కేడర్ ని సరైన దారిలో నడిపించే ప్యూహాన్ని సిద్దం చేస్తున్నారట..
ఏపీలో బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ పెరిగిందా..పవన్ ని బీజేపీ నేతలు లైట్ తీసుకుంటున్నారా..తిరుపతిలో జనసేన నిర్వహించిన సమావేశాల్లో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ తర్వాత ఈ అంశం పైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. పవన్ మాటలు ఏపీలోని బీజేపీ నాయకుల కంటే.. ఢిల్లీలో ఉన్న కమలనాథులకు బలంగా తాకినట్టు సమాచారం. దీంతో గ్యాప్ పూడ్చే ప్రయత్నం మొదలు పెట్టింది బీజేపీ అధిష్టానం.ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగమేఘాలపై హైదరాబాద్ వచ్చి పవన్ కల్యాణ్‌తో సమావేశయ్యారు.
ఈ భేటీ ముగిసిందో లేదో మరునాడే ఏపీ బీజేపీ ఇంఛార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పురందేశ్వరి సైతం హైదరాబాద్ వచ్చి పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. తిరుపతి లోకసభకు జరగబోయే ఉపఎన్నికల్లో మిత్రపక్షాలలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ వచ్చింది. బీజేపీ సమావేశాల్లో జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని వీర్రాజు ప్రకటన చేశారు. అప్పటి నుంచి రెండు పార్టీల మద్య గ్యాప్ పెరిగింది.
ఢిల్లీలో బీజేపీ నేతలతో పవన్ మాట్లాడినప్పుడు ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటారని నిర్ణయం తీసుకుంటే.. దానిని భిన్నంగా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు జనసైనికులు. అప్పటి నుంచి గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి.. పవన్‌కల్యాణ్ కామెంట్స్ రూపంలో మరోసారి బయటపడింది. ఢిల్లీ బీజేపీ నేతలు తమతో బాగానే ఉంటోన్నా.. ఏపీ బీజేపీ నేతలతో గ్యాప్ ఉందని చిన్న చూపు చూస్తున్నారని బాంబు పేల్చారు పవన్.
అయితే పవన్ కల్యాణ్, సోము వీర్రాజు భేటీ తర్వాత రెండు పార్టీలు వేర్వేరుగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనల్లోనూ ఆ వ్యత్యాసం కనిపించింది. తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థిపై చర్చించామని బీజేపీ చెబితే.. ఎక్కడైనా చిన్నపాటి గ్యాప్ ఉన్నా ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని చక్కదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు అని జనసేన ప్రకటనలో ఉంది. ఏపీలో ఆలయాల్లో దాడులు,రైతుల విషయంలో జనసేన బీజేపీ పోరాటం చేసినా ఎవరికివారుగానే కార్యక్రమాలు నిర్వహించారు.
ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు,పవన్ కామెంట్స్ వెరసి పెరిగిన అగాధాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది బీజేపీ అధిష్టానం. ఈ సమావేశాలతో గ్యాప్ పూడ్చుకుంటారో లేదో చూడాలి.