దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడి కార్యాలయానికి చేరుకున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన భేరసారాల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కొనుగోలు వ్యవహారంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, నిందితుడి మధ్య జరిగిన ఆడియో సంభాషణ అంటూ శుక్రవారం ఓ ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ఆడియో వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడి అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన ఈడీ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై చర్యలు చేపడతామని ఈడీ అధికారులు రఘునందన్ రావుకు తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ వ్యవహారంపై సీట్ తో దర్యాప్తు చేయించాలని కోరుతూ బిజెపి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యవహారంలో తమ ప్రమేయం లేదంటూ యాదాద్రి నరసింహస్వామి ఆలయంలో ప్రమాణం కూడా చేశారు.