రాజకీయాల్లో వ్యూహాలకు కొదవలేదు. విమర్శలకు-ఎత్తుగడలకు కూడా అంతూదరీ లేదు. అయితే, ఆ వ్యూహాలు కలిసి వచ్చే లా ఉంటే.. పార్టీలు ఎదిగేందుకు అవకాశం.. ప్రజలు విశ్వసించేందుకు క్లారిటీ ఉంటాయి. మరి ఈ విషయాలు తెలిసో.. తెలియదో కానీ.. బీజేపీ రాష్ట్ర చీఫ్.. సోము వీర్రాజు మాత్రం వ్యూహాత్మక రాజకీయాలకు తెరదీశారు. వైసీపీ-టీడీపీలపై విరుచుకుపడ్డారు. నంద్యాలలో జరిగిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటను తనకు అనుకూలంగా మార్చుకునేదుకు ప్రయత్నించారు. మతాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ, టీడీపీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ముస్లింలు గోల పెట్టగానే జగన్ సర్కారు పోలీసులను అరెస్టు చేయడం.. సమంజసమేనా అన్నారు.
అంతేకాదు, కొందరు ముస్లింలను వెంటేసుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు. అంటే.. సోము వ్యూహం ఇక్కడ స్పష్టంగా అర్ధమవుతోంది. తాము ఎలాగూ.. ముస్లింలకు వ్యతిరేకం కనుక.. ఇతర సామాజిక వర్గాలు ఏవీ కూడా టీడీపీకి, వైసీపీకి అనుబంధంగా ఉండరాదనే వ్యూహాన్ని ఆయన ప్లే చేశారనేది విశ్లేషకుల మాట. తనకు దక్కని ముస్లిం ఓట్లను వదులుకున్నా.. ఫర్వాలేదు.. కానీ, తాను మాత్రం వారి సామాజిక వర్గానికి చెందిన ఓట్లను కైవసం చేసుకోవా లనే వ్యూహంతో సోము ముందుకు సాగారు. ఈ క్రమంలోనే ముస్లిం సెంట్రిక్‌గా సోము వీర్రాజు వీరావేశంతో వ్యాఖ్యలు సంధించారు. దీనికి ప్రతిపక్షాలు కూడా ధీటుగా సమాధానం చెప్పడం తెలిసిందే.
ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే.. సోము భావిస్తున్నట్టు.. లేదా.. ఆయన వ్యూహానికి అనుకూలంగాను.. ఇతర సామాజిక వర్గాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతాయా? అనేది చూడాలి. ఈ రకంగా చూసినా.. సోము వ్యూహం ఎక్కడా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. కమ్మ వర్గం.. బీజేపీకి చేరువ అవుతున్న క్రమంలో ఆ పార్టీ నేతలను సోము పక్కన పెట్టడం వారిలో ఆగ్రహానికి కారణమైంది. ఇక, కాపు వర్గం.. తమ డిమాండ్ల విషయంలో సోమును ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఇక, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు అటు ఇటుగా ఉన్నాయి.
వీరు పూర్తిగా బీజేపీకి మద్దతు పలుకుతారని చెప్పలేం. ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా బీజేపీ దూరం. ఇలా మొత్తంగా చూస్తే.. 1% ఓటు బ్యాంకు మాత్రమే ఉన్న బీజేపీ.. ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా ఎదగాలని అనుకోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అందరినీ కలుపుకొని పోవాల్సిన సమయంలో ఇలా వ్యవహరించడం పార్టీ పుంజుకునేందుకు పెను విఘాతంగా మారుతుందని కూడా చెబుతున్నారు. రాజకీయాల్లో సీనియర్, ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న సోము మాత్రం ఈ సూత్రానికి విరుద్ధంగా వ్యవహరించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.