తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలకూ.. అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగిం ది. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ ఒక రకంగా చూస్తుంటే.. అధికార పార్టీ టీఆర్ ఎస్ మరో వ్యూహంతో ఆలోచిస్తోంది. దీనికి కారణం.. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోవడమే! పైకి దుబ్బాక పోరును లైట్ తీసుకుంటున్నామని.. తాము ఓడినా.. గెలిచినా.. ఒకే విధంగా ఉంటామని వ్యాఖ్యలు చేస్తున్నా.. ఒకింత లోతుగా ఆలోచిస్తే.. మాత్రం కేసీఆర్ తీవ్రంగా ఆవేదన చెందారు. ఏ పార్టీ అయితే.. తనకు ప్రతిబంధకమని ఆయన భావించారో.. అదే పార్టీ దుబ్బాకలో విజయం సాధించడాన్ని కేసీఆర్ తట్టుకోలేక పోయారు. దీంతో సదరు పార్టీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సంసిద్ధులయ్యారు. మరి ఈ క్రమంలో గ్రేటర్‌లో ఇప్పుడున్న పరిస్థితిలో టీఆర్ ఎస్ గెలుపు సాధ్యమేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇటీవల కురిసిన వర్షాలు.. నడుములోతు వరద, మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు వంటివి.. కేసీఆర్ సర్కారుపై ప్రజల ఆగ్రహానికి గురి చేశారు. ఇక, కరోనా నేపథ్యంలో హైదరాబాద్ ఆదిలో ముందు వరుసలో నిలిచింది. దీంతో కేసీఆర్ సర్కారుపై ప్రజల్లో తలెత్తిన వ్యతిరేకత.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రభావం చూపించడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఈ విషయం కేసీఆర్‌కు తెలియదా? అంటే.. ఖచ్చితంగా తెలుసు! అందుకే ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తోన్న సమాచారం మేరకు.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. రెండు పార్టీలను తన గుప్పిట పెట్టుకుని నడిపిస్తున్నారని అంటున్నారు. వీటిలో ఒకటి టీడీపీ, రెండు జనసేన అనే టాక్ హైదరాబాద్ రాజకీయాల్లో హల్ చేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎంత లేదన్నా.. 30 శాతం టీఆర్ ఎస్‌కు వ్యతిరేక ఓటు బ్యాంకు ఏర్పడిందనే అంచనాలు వచ్చాయి. ఇప్పుడు దీనిని స్థానికంగా ఉన్న బీజేపీకో.. లేదా కాంగ్రెస్‌కో పడకుండా చూసుకుంటే.. కేసీఆర్ సక్సెస్ అయినట్టే. ఇదే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారు. లోపాయికారీగా టీడీపీ, జనసేనలతో ఇప్పటికే కేటీఆర్ చర్చించారని కూడా రాజకీయ వర్గాల గుసగుస.
దీనిలో భాగంగానే.. తనకు బలం లేదని తెలిసి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్టు చెబుతున్నారు. సెటిలర్లు బాబు వైపు మొగ్గు చూపుతుండడం.. టీఆర్ ఎస్ వ్యతిరేక ఓటు చీలితే.. టీడీపీకి పడే అవకాశం ఉండడంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా బాబును రంగంలోకి దింపారని అంటున్నారు. ఇక, జనసేన కూడా ఇక్కడ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి తాము బీజేపీతోనే ఉంటామన్న పవన్ ఇంతలోనే మనసు మార్చుకోవడం వెనుక కూడా టీఆర్ ఎస్ వ్యూహం ఉందని స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలతోనే టీడీపీ, జనసేనలు ఒంటరిగా బరిలో దిగుతున్నాయి. మరి కేసీఆర్ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.