వైసీపీ అసమ్మతి నాయకుడు, నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామరాజు దూకుడు వెనుక బీజేపీ ఉందా? ఏపీ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. నిజానికి ఆయన బీజేపీ అనుకూల నాయకుడే. అయితే, టికెట్ దక్కక పోవడంతోనే వైసీపీలోకి వచ్చి గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఏం జరిగిందో ఏమో.. ఆయన వైసీపీతో విభేదిస్తున్నారు. అదేసమయంలో బీజేపీతో అంటకాగుతున్నారు. ప్రధాని మోడీని నేరుగా తన ఫ్యామిలీతో వెళ్లి కలిశారు. తర్వాత మోడీని అవకాశం వచ్చినప్పుడల్లా ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
పార్లమెంటులోను, బయటకు కూడా వైసీపీని ఎండగడుతున్నారు. కొన్నాళ్ల కిందటి వరకు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడకపోయినా.. ఇటీవల కాలంలో జగన్‌ను నేరుగా ఢీ అంటున్నారు. అదేసమయంలో బీజేపీ నేతలకు సన్నిహితంగా ఉంటూ.. తనకు వ్యక్తిగత భద్రతను సమకూర్చుకున్నారు. పార్లమెంటు పదవులు సైతం పొందారు. నియోజకవర్గం అభివృద్ధి నిధులు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీకి అత్యంత సన్నిహితంగా బీజేపీలో నేతలే లేకపోగా.. రఘురామ చేరువ అవుతున్నారు. ఆయనకంటూ.. ప్రొజెక్ట్ చేసేందుకు ఓ వర్గం మీడియా కూడా ఉండడం గమనార్హం.
ఈ పరిణామాలు ఇలా ఉంటే.. ఏపీలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వైసీపీలో నెలకొన్ని అంతర్గత పరిణామాలు, సీఎం జగన్ దూకుడు, న్యాయవ్యవస్థలను టార్గెట్ చేయడం వంటి వాటి నేపథ్యంలో రేపు ఏమైనా జరిగి జగన్ కనుక సీఎం పీఠాన్ని వదులుకోవాల్సి వస్తే.. బీజేపీ ఇక్కడ రాజును పావుగా చేసుకుని చక్రం తిప్పేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే రాజుకు అనుకూలంగా వైసీపీలో కొందరు నేతలు ఉన్నారని, మరికొందరు అసంతృప్తితో ఉన్నవారిని లాగేసి.. ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయించొచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి రాబోయే రోజుల్లో ఏపీలో ఏపరిణామాలైనా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
-vuyyuru subhash