బీజేపీ నేతలు రాజకీయ వ్యూహాలకు తెరదీసినట్టు తెలుస్తోంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. తిరుపతి లోక్‌సభ స్థానం ఇటీవల ఖాళీ అయింది. వైసీపీ అభ్యర్థి.. తిరుపతి ఎంపీ బి.దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో మరో నాలుగు మాసాల్లో ఇక్కడ ఎంపీ స్థానానికి నోటిపికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించిందని తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో ఏ పార్టీ నేత మృతి చెందితే.. వారి కుటుంబానికి టికెట్ కేటాయిస్తే.. మిగిలిన పార్టీలు కూడా సహకరిస్తున్నాయి.
అయితే, ఈ దఫా వైసీపీ నేతలు బి.దుర్గాప్రసాద్ కుటుంబానికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో పోటీ అనివార్యంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అయినప్పటికీ.. టీడీపీ పోటీ నుంచి తప్పుకొంటుందని తెలుస్తోంది. దీంతో ఈ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటే బెటర్ అని రాష్ట్ర కమల నాథులు భావిస్తున్నారు. అయితే, గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఇక్కడ నుంచి ఓడిన బొమ్మి శ్రీహరిరావు ప్రస్తుతం యాక్టివ్‌గా లేరు. దీంతో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. అయితే, ఆ ఇచ్చేదేదో.. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన.. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికే ఇచ్చేద్దామని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెతో మంత్రాంగం నెరుపుతున్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి పరాజయం పాలైన పనబాక.. తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో పార్టీ కూడా ఆమెను పరిగణించడం లేదు. ఆది నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమానికీ లక్ష్మి కానీ, ఆమె కుటుంబం కానీ పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ఆమెను బీజేపీలోకి తీసుకువచ్చి తిరుపతిలో పోటీకి పెడితే.. బెటరని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. గతంలో ఇక్కడ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కిన చరిత్ర ఉంది. పైగా బీజేపీ ఇప్పుడు యాక్టివ్‌గా కూడా ఉంది. ఇక, పనబాక పరిస్థితి చూస్తే.. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి నాలుగున్నర లక్షలకు పైగా ఓట్లు సంపాయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె ఈ దఫా ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు అవకాశం ఉందని కమల నాథలు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, పనబాక సైడ్ నుంచి చూసినా.. బీజేపీలోకి వస్తే.. బెటరనే సూచనలు వస్తున్నాయి. ఏపీలో బీజేపీకి ప్రాతినిధ్యం లేదు. సో.. ఆమె కనుక గెలిస్తే.. కేంద్రంలో చక్రం తిప్పేందుకు అవసరమైతే.. మంత్రిపదవిని దక్కించుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని కమలనాథులే లెక్కలు వేస్తుండడం గమనార్హం. ఏతావాతా ఎలా చూసినా.. అటుఆమెకు, ఇటు వీరికి కూడా బాగుంటుందనే సూచనల నేపథ్యంలో ఆమెతో మంత్రాంగాలు ప్రారంభించారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
-Vuyyuru Subhash