గ్రేటర్ లో గెలిచిన కార్పోరేటర్లను కాపాడుకునే పనిలో కమలదళం

-

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గెలిచిన కార్పొరేటర్లను కాపాడుకోవడం బీజేపీకి సవాల్‌గా మారింది.గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నాయి. కానీ కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్ల ఎన్నికను అధికారికంగా గుర్తిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. అలాగే కొత్త కార్పొరేటర్లుగా ఎన్నికైన వారి జాబితాను ప్రభుత్వానికి పంపలేదు. దీంతో కొత్త పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ ఒత్తిడి చేస్తోంది..రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని వరస ఉద్యమాలు చేస్తున్నారు కమలనాథులు.

GHMC elections 2020 live updates – manalokam.com

గ్రేటర్‌లో కొత్త కౌన్సిల్‌ భేటీ పై కొన్ని రోజులు సైలెంట్‌గానే ఉన్న బీజేపీ.. ఈ మధ్య గేర్‌ మార్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని వరస ఉద్యమాలు చేస్తున్నారు కమలనాథులు. కొత్తగా ఎన్నికైన వారికి సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు సర్టిఫికెట్లు కూడా జారీ చేశారు. కానీ వెంటనే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నది వారి డిమాండ్‌. ప్రస్తుత పాలకవర్గానికి ఇంకా టైమ్‌ ఉందని చెబుతుంది ఎన్నికల కమిషన్‌. మరి అలాంటప్పుడు ఎందుకు ముందుగా ఎన్నికలకు వెళ్లిందన్నది బీజేపీ నేతల ప్రశ్న. బీజేపీ నుంచి 48 మంది కార్పొరేటర్లు గెలిచారు. వీరిలో చాలా మందిపై అధికార పార్టీ కన్నేసిందన్నది బీజేపీ అనుమానం. ఒకటి రెండు సందర్భాలలో తమ కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారని కూడా ఆరోపించారు.

బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన తర్వాత వారితో పార్టీ ఆఫీస్‌లో సమావేశమయ్యారు నాయకులు. పార్టీ లక్ష్యాలను.. ఆలోచనలను.. రాజకీయ పరిణామాలను వారికి వివరించారు. ఆ తర్వాత చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయానికి కార్పొరేటర్లను తీసుకెళ్లి ప్రమాణం చేయించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. బీజేపీ కార్పొరేటర్లను మెయిన్‌ స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నంగా కనిపిస్తున్నా.. కమలనాథులు వారిని ఓ కంట కనిపెట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారని మరికొందరు భావిస్తున్నారు. అందుకే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని.. ముందుగానే ఎన్నికలకు ఎందుకు వెళ్లారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్‌ చేస్తున్నారు బీజేపీ నాయకులు.

గ్రేటర్ కొత్త కౌన్సిల్‌ కొలువుదీరాలంటే.. రాజ్యాంగపరంగా తమ ముందు ఉన్న ఆప్షన్లతో కుస్తీ పడుతున్నారట కమలనాథులు. న్యాయపరంగా పోరాడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారట. రేపటి రోజున కొత్త పాలకమండలి కొలువుదీరినా బీజేపీ ఎలాగూ పోరాటాలు చేయాలి కాబట్టి.. ఇప్పుడు చేస్తున్న ఆందోళనలు అక్కరకు వస్తాయని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ నాయకులు ఎన్ని ధర్నాలు చేసినా.. రాష్ట్ర ఎన్నికల సంఘం సంక్రాంతి వెళ్లేవరకు ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది. అసలు కొత్త పాలకవర్గం కొలువుదీరే దిశగా అడుగులు పడతాయా లేక ప్రభుత్వం మరేదైనా ఆలోచన చేస్తుందా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news