దేవినేనికి కీలక పదవిచ్చి చంద్రబాబు తప్పు చేస్తున్నారా ?

-

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర కమిటీల ఏర్పాటు చాలా రోజుల క్రితమే పూర్తి చేశారు. ఇప్పుడు అదనంగా ప్రతి 5 పార్లమెంట్‌ స్థానాలకు ఒకరిని ఇంఛార్జ్‌ పేరుతో ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు ఇచ్చారు. అయితే అంతకంటే కీలక బాధ్యతలను ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమాకి చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తుంది.నేతలతో ఆమడ దూరంలో ఉండే ఆయనకు ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించడంపై సొంత పార్టీ నేతల మధ్యే ఆసక్తికర చర్చ నడుస్తుంది….

టీడీపీ రాష్ట్రకమిటీలతో పాటు అదనంగా ప్రతి 5 పార్లమెంట్‌ స్థానాలకు ఒకరిని ఇంఛార్జ్‌ పేరుతో బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. వీరిలో బుద్దా వెంకన్న, పంచుమర్తి అనురాధ, బత్యాల చెంగల్రాయుడు, అనగాని సత్య ప్రసాద్, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇతర పార్టీలతో సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుకు అప్పగించారు. ఇక్కడే టీడీపీలో అసలు చర్చ మొదలైంది.

టీడీపీ నేతలతోనే దేవినేని ఉమాకు సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అందరినీ దూరం చేసుకున్నారని ఇప్పటికీ చెబుతుంటారు. పార్టీలో సంగతి అలా ఉంటే.. అంతా తానై నడిపిన కృష్ణాజిల్లాలో కూడా దేవినేనితో ఎవరికీ పెద్దగా సఖ్యత లేదని సమాచారం. దీనికంతటికీ ఉమా స్వయంకృతాపరాధమేని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటాయి. ఫలితంగా పార్టీలో, జిల్లాలో తనవాళ్లనుకునేవారు ఎవరూ దేవినేని ఉమాకు లేకుండా పోయారు. అధికారం పోయిన తర్వాత ఉమాలో కొంత మార్పు వచ్చి అందరికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

మరి చంద్రబాబు ఏం లెక్కలు వేసుకున్నారో ఏమో.. ఇతర రాజకీయ పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతలను దేవినేని ఉమా మహేశ్వరరావుకు అప్పగించారు. ఈ నిర్ణయంపై టీడీపీ నేతలు సైతం అవాక్కయ్యారట. పార్టీలో ఉన్నవారితోనే 2 నిమిషాలు మాట్లాడలేని దేవినేనితో ఇతర పార్టీల నాయకులతో సమన్వయం చేయడం అయ్యే పనేనా అని ప్రశ్నిస్తున్నారట. తాను చెప్పేది తప్ప ఎదుట వ్యక్తి అభిప్రాయం వినడానికి ఇష్టపడరనే విమర్శలు కూడా ఉమాపై ఉన్నాయట. ఇప్పుడు కొత్త పదవిలో రాజకీయ మంత్రాంగాలు చేయడంలో ఏ మేరకు రాణిస్తారు అన్నదానిపై టీడీపీ వర్గాల్లోనే సందేహాలు ఉన్నాయట.

ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి.. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు కాస్త శ్రద్ధ పెట్టి ఉమా పనిచేస్తారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. టీడీపీలో మంత్రులుగా పనిచేసిన చాలా మంది ఇప్పటికీ బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. ఉమా మాత్రం రోడ్డక్కి వైసీపీ సర్కార్‌పై పోరాటం చేస్తున్నారు. ఇంతకుముందు తన పరిధిని విస్తరించుకునే పరిస్థితిలో ఆయన లేరన్నది పార్టీ వర్గాల టాక్‌. వాస్తవానికి టీడీపీ పొలిట్‌బ్యూరోలో స్థానం కోసం ఉమా ఆశపడ్డారు. సామాజిక సమీకరణాలు ఆయన ఆశలకు బ్రేక్‌లు వేశాయి. అందుకే కీలక బాధ్యతలు అప్పగించారని అనేవారు కూడా ఉన్నారు. మరి.. కొత్త పదవికి తానే సూటవుతానని దేవినేని ఉమా నిరూపిస్తారో లేక.. చంద్రబాబు ఇచ్చిన పదవిని అలంకార ప్రాయంగా మార్చుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news