ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించి 25 మంది మృతిచెందగా, 110 మందికిపైగా గాయపడిన ఘటన టర్కీలో చోటు చేసుకుంది. అంతేకాకుండా.. ఈ ప్రమాదంలో మరో 50 మంది గనిలో చిక్కుకుపోయారు. బొగ్గగనిలో శుక్రవారం సాయంత్రం మీథేన్ వాయువు వల్ల పేలుడు సంభవించింది. దీంతో 25 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారని వెల్లడించారు అధికారులు. 11 మంది క్షేమంగా బయటపడ్డారని వారిని దవాఖానకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. సుమారు 50 మంది కార్మికులు గనిలో 300 నుంచి 350 మీటర్ల దూరంలో చిక్కుకుపోయారని తెలిపారు అధికారులు.
వారిని వీలైనంత తొందరగా రక్షిస్తామని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సులేమాన్ సోయ్‌లు తెలిపారు. ఇప్పటికే చాలా మందిని బయటకు తీసుకొచ్చామన్నారు. గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెట్టీన్ కోకా ట్వీట్ చేశారు. టర్కీలోని సోమాలో 2014లో జరిగిన బొగ్గుగని ప్రమాదంలో 301 మంది కార్మికులు మరణించారు.