ఏపీలోని ఓ షుగర్ ఫ్యాక్టరీలో పది రోజుల వ్యవధిలోనే రెండో సారి ప్రమాదం జరిగింది. తరచూ ప్రమాదాలతో కార్మికులు బెంబేలెత్తుతున్నారు. ఇవాళ జరిగిన పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాకినాడ వాకలపూడిలోని ప్యారీ షుగర్స్‌లో మరోసారి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడగా.. ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 19న ఇదే పరిశ్రమలో ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల్లోనే పరిశ్రమలో మళ్లీ ప్రమాదం జరగడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. బాయిలర్ పేలడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
వాకలపాడి పారిశ్రామికవాడ ప్రాంతంలో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీ పరిశ్రమలో పంచదారను శుద్ధి చేసి ఎగుమతి చేస్తుంటారు. అయితే, తాజాగా జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి అసలేం జరిగింది? ఎందుకు జరిగింది? అనే విషయాలపై ఎలాంటి సమాచారం లేదు. ఆస్పత్రి వద్దకు సిబ్బంది వచ్చినవాళ్లు నోరు మెదపడంలేదని తెలుస్తోంది. ఈ నెల 19న ప్రమాదం జరిగిన సందర్భంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకోవడం.. మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినా మళ్లీ అక్కడ ప్రమాదం జరగడం గమనార్హం.