వీడియోకాన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌కు ఊరట లభించింది. చందా కొచ్చార్‌తో పాటు ఆమె భర్తను రిలీజ్ చేయాలని బాంబే హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. వాళ్ల అరెస్టు చట్టానికి లోబడి జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. వీడియోకాన్ సంస్థకు అక్రమరీతిలో రుణాలు మంజూరీ చేసిన కేసులో చందా కొచ్చార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కుటుంబ లబ్ధి కోసం కొచ్చార్ ఫ్యామిలీ చీటింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీడియోకాన్ రుణాన్ని ఎన్పీఏగా భావించి, దాన్ని బ్యాంక్ ఫ్రాడ్‌గా ప్రకటించారు.
చందా కొచ్చారోతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చార్‌ను డిసెంబర్ 24వ తేదీన సీబీఐ అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూపు సంస్థకు 2012లో సుమారు 3250 కోట్ల మొత్తాన్ని అక్రమరీతిలో లోన్ ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పీకే చావన్‌లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును ఇచ్చింది. క్రిమినల్ కోడ్‌లోని 41ఏ సెక్షన్‌ను ఉల్లంఘించి ఆ ఇద్దరి అరెస్టు చేసినట్లు కోర్టు తెలిపింది. లక్ష రూపాయాల బెయిల్ బాండ్‌పై ఆ ఇద్దర్ని విడిచిపెట్టనున్నారు.