కరోనా వ్యాక్సిన్ల సామర్థ్యంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నా కొందరిలో రోగనిరోధక శక్తి పెరగకపోవడంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అదీగాక కరోనా వ్యాక్సిన్ తీసుకుని చాలా రోజులు అవుతుంటే గనక, వాటి సామర్థ్యం తగ్గిపోతుందనే వాదనా ఉంది. అందువల్ల బూస్టర్ డోస్ గురించిన వార్తలు కూడా ఎక్కువవుతున్నాయి. ఐతే ప్రస్తుతం ఒరిస్సాకి చెందిన లైఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ జరిపిన పరిశోధన ప్రకారం, రెండు డోసులు తీసుకున్నా కూడా కొంతమందిలో రోగనిరోధక శక్తి పెరగట్లేదని తేల్చింది.
కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ 20శాతం మందిలో కరోనా ప్రతిరక్షకాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి కాలేదని లైఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ స్పష్టం చేసింది. అందువల్ల బూస్టర్ డోస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని తెలిపింది. కరోనా ప్రతిరక్షకాలు ఉత్పత్తి కాని వారు బూస్టర్ డోసు వైపు మొగ్గాల్సిందే అని లైఫ్ సైన్సెస్ ప్రకటించింది.