ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26వ తేదీ డెడ్ లైన్ : బొప్పరాజు వెంకటేశ్వర్లు

-

ఉద్యోగుల సమస్యలను ఈనెల 26వ తేదీలోపు పరిష్కరించాలని ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. 26వ తేదీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతలోపు సమస్యలపై చీఫ్ సెక్రెటరీకి లేఖ రాస్తామని తెలిపారు. ఏపీ అమరావతి జేఏసి రాష్ట్ర మహాసభ ముగిసిందని తెలియజేసిన ఆయన.. ఈ మహాసభ విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీజేఏసీ 94 సంఘాల నుంచి 100 సంఘాలకు పెరిగిందని.. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగుల మహాసభ ఎప్పుడూ జరగలేదని అన్నారు.

మూడున్నరేళ్లుగా ఉద్యోగులు ఓపిక పట్టారని.. అసలు ఉద్యోగులను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, దాంతో ఉద్యోగుల జీవితాలు దారుణంగా తయారైందని ఫైర్ అయ్యారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కార్డు కూడా ఎందుకు పనికిరాకుండా పోయిందని మండిపడ్డారు. డీఏలు ఇచినట్టే ఇచ్చి, ఆ వెంటనే వాటిని వెనక్కి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై మనసు పెట్టకపోవడం వల్లే.. పరిష్కారం కావట్లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఉద్యోగులుగా పని చేసి.. రూ. 2,500 సంపాదించే వారికి కూడా రేషన్ కార్డు పోయిందని వాపోయారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేదని.. సీఎం స్వయంగా పరిష్కరిస్తారని ఎదురు చూసినా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news