ఆంధ్రప్రదేశ్ లో రసవత్తర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో… సీఆర్‌డీఏ బిల్లు రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలపడం శుభపరిణామమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంకు సీఎం వైఎస్ జగన్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని బొత్స చిలక పలుకులు పలికారు. ఇక గవర్నర్ నిర్ణయంతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన.. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అయితే విశాఖ రాష్ట్ర పరిపాలన రాజధానిగా ఏర్పాటు అయిన తర్వాత శరవేగంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అంటూ మంత్రి బొత్స ఆశాభావం వ్యక్తం చేసారు. ఇదే క్రమంలో ఢిల్లీ, ముంబై లతో పోటీపడేలా విశాఖ రాజధాని అభివృద్ధి చేస్తామంటూ తెలిపిన బొత్స సత్యనారాయణ.. విశాఖ లో ఉన్న ప్రభుత్వ భూములను ఎక్కువగా రాజధాని నిర్మాణం కోసం వాడుకుంటామంటూ వివరించారు. అలాగే.. అమరావతి రాష్ట్రంలో అంతర్భాగం అంటూ తెలిపిన బొత్స.. ఆ ప్రాంతాన్ని సకల హంగులతో తీర్చిదిద్దాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది అంటూ వ్యాఖ్యానించారు.
ఇవన్నీ బొత్స ఇప్పుడు అంటోన్న మాటలు. కానీ గతంలో అంటే ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చాలా జాగ్రత్తగా రాజధాని విషయాన్ని డీల్ చేస్తూ.. అన్ని రకాలుగాను పలు దఫాలుగా ప్రజలకు ట్యూన్ చేస్తూ అమరావతిలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలను వెలుగులోకి తేవడంలో.. అది అందరికీ ఎప్పటికప్పుడు తెలపడంలో బొత్స కీలకంగా వ్యవహరించాడు. దీంతో ఇప్పటితో బొత్సకిచ్చిన టాస్క్ కంప్లీట్ అయింది అంటూ వైసీపీ శ్రేణులు ముచ్చటించుకుంటున్నాయి.
మొత్తానికి రాజధానుల అంశంపై బొత్స వేసిన బాణం ఫలించింది. కొడ్తే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అంటూ బొత్స ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పట్టుకెళ్లాడ్రోయ్… ఏపీ రాజధానిని విశాఖకు బొత్స పట్టుకెళ్లాడు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.