ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న తమ కుమారుడు ఓసారి మృత్యువు ఒడిదాకా వెళ్లి తిరిగి వచ్చాడు. కొడుకు ప్రాణాలతో దక్కాడన్న ఆ తల్లిదండ్రుల ఆనందం కొన్నిరోజులు కూడా నిలవలేదు. మరో ప్రమాదం ఆ బాలుడి ప్రాణాలు తీసుకుపోయింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరులో చోటుచేసుకుంది.
కట్కూర్ సర్పంచ్ జిల్లెల అశోక్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన దేవునూరి శ్రీకాంత్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు. వారింట్లో ఉన్న కిచెన్‌కు మరో రెండు గదులకు మధ్య కాస్త గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ నుంచే వెలుతురు, గాలి వస్తుంది. ఆ ఖాళీ ప్రదేశంలో శ్రీకాంత్.. తడక ఏర్పాటు చేసి గాలికి ఎగిరిపోకుండా బండరాళ్లు పెట్టాడు.
సోమవారం రోజున ఆ తడక పైనుంచి కోతులు ఇంట్లోకి చొరబడ్డాయి. వంటింట్లోనే ఉన్న రజిత వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించింది. ఆమె వెంటే చిన్న కుమారుడు అభినవ్ ఉన్నాడు. బెదిరిపోయిన కోతులు వచ్చిన మార్గం నుంచే వెళ్లేందుకు ప్రయత్నించగా పైన ఉన్న రాయి కాస్త అభినవ్‌పై పడి అతడి తలపగిలి అక్కడికక్కడే మరణించాడు.
నెలక్రితమే అభినవ్ ఇంట్లో గడప దాటుతున్నప్పుడు కింద పడ్డాడు. ఆ సమయంలో నేలపై ఉన్న కత్తి తగిలి గొంతు తెగింది. ఆస్పత్రిలో చికిత్స చేయించగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతలోనే కోతుల వల్ల ప్రాణాలు కోల్పోయాడు.