విజయవాడ రైల్వే స్టేషన్‌లో మూడేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఈ మేరకు బాలిక తల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వెతికింది. దీంతో బాలిక ఎక్కడ కనిపించకపోవడంతో.. ఆమె రైల్వే స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్‌కు గురైన బాలిక పేరు షేక్ షఫీదాగా గుర్తించారు. తల్లిదండ్రులు రైల్వేస్టేషన్‌లో చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుని జీవనం సాగిస్తుంటారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేపట్టారు. ఈ మేరకు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
చిన్నారి షేక్ షఫీదాను తీసుకెళ్తున్న దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రైల్వే స్టేషన్ నుంచి బాలికను ఎక్కడికి తీసుకెళ్లారనే విషయంపై విజయవాడ పోలీసులు నగరంలోని సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. షఫీదాను రైల్వే స్టేషన్ బయటకు తీసుకొచ్చి.. ఆటోలో తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. నెహ్రూ బొమ్మ సెంటర్ ఏరియాలో కొండపైకి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు చిట్టినగర్, పంజా సెంటర్, వాగు సెంటర్, డెయిరీ ఫ్యాక్టరీ, సితార సెంటర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫాంపై చిన్నారి ఆడుకుంటోందని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని మహిళ అక్కడికి వచ్చి చాక్లెట్ ఆశ చూపించి బాలికను తీసుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేశామని, త్వరలో చిన్నారిని గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.