ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం ఆసక్తి చూపించి ఉంటే గిరిజన వర్సిటీ ఎప్పుడో ఏర్పాటయ్యేదని వెల్లడించారు. యూనిర్సిటీకి భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు జాప్యం చేసిందని మోదీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి గిరిజనులపై ప్రేమ లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ కారు స్టీరింగ్ వేరే వాళ్ల చేతుల్లో ఉందని మోదీ విమర్శించారు.
స్టీరింగ్ ఎవరు తిప్పుతున్నారో మీకు తెలుసు కదా అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని రెండు కుటుంబాలు నడిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కమీషన్, కరప్షన్… ఆ రెండు పార్టీల విధానం అని పేర్కొన్నారు. పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ, బై ది ఫ్యామిలీ, ఫర్ ది ఫ్యామిలీ అనేది వాళ్ల నినాదనం అని మోదీ విమర్శించారు. ఇవాళ తమ సభకు వచ్చిన జనాల ప్రేమాభిమానాలు అద్భుతం అని, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లకు ఇక నిద్ర పట్టదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఈ రెండు పార్టీలకు గురువు ఎంఐఎం అని అభివర్ణించారు.
పాలమూరు ప్రజాగర్జన సభలో బీజేపీ చీఫ్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటనపై ప్రధానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పసుపు రైతుల కోసం బోర్డు ఏర్పాటు ప్రకటన చారిత్రాత్మకమన్నారు. అనేక ఏళ్లుగా రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. అభివృద్ధి పనుల కోసం ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే ఆయనను కలిసేందుకు సీఎం కేసీఆర్‌కు తీరిక లేదన్నారు. కేంద్రం తెలంగాణకు వేల కోట్ల నిధులు ఇస్తుంటే… కేసీఆర్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ లాంటి మోసపూరిత సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చొని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్టే అని అన్నారు.