అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచారణ జరిపించాలి అని బీఆర్‌ఎస్ ఎంపీలు గట్టి పట్టుబట్టారు. అదానీ అంశంపై చర్చించాలని బీఆర్‌ఎస్ మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చింది. అయితే రాజ్యసభ ,లోక్‌సభ సభాపతులు నోటీసుపై చర్చను అనుమతించకపోవడంతో నిరసనగా బీఆర్‌ఎస్ ఎంపీలు ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ఆమ్‌ఆద్మీ, శివసేన ఎంపీలు కూడా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు.
హిండెన్ బర్గ్ నివేదిక భారతీయ ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెస్తుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత , ఎంపీ కె కేశవరావు పేర్కొన్నారు. అటు లోక్ సభలో హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని బీఆర్ఎస్ లోక సభ పక్ష నేత,ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇతర బిజినెస్ లను వాయిదా వేస్తూ తక్షణ చర్చకు అనుమతివ్వాలని వాయిదా తీర్మానంలో కోరారు.
అనంతరం పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మాట్లాడుతూ అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, డిమాండ్‌ను అంగీకరించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ స్పందన సరిగా లేదని, అదానీ వ్యవహారం అంతా బాగుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం సరికాదన్నారు. దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యవహరించాలని హితవు పలికారు. నిరసనల్లో బీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.