ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో ఆర్మూరు కూడా ఒకటి. ఈ స్థానం బిఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా ఉందని చెప్పాలి. అలా బిఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న స్థానంలో పై చేయి సాధించాలని బిజేపి చూస్తుంది. ఈ సారి ఆర్మూరు స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. దీంతో ఈ సారి ఆర్మూరు పోరు రసవత్తరంగా మారనుంది. గతంలో ఈ స్థానంలో కాంగ్రెస్-టిడిపిలు నువ్వా-నేనా అన్నట్లు తలపడేవి.
తర్వాత బిఆర్‌ఎస్ ఎంట్రీతో సీన్ మారింది. 2004లో ఈ సీటుని బిఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది. 2009లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఇక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా బిఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది. బిఆర్‌ఎస్ తరుపున జీవన్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డికి ఆర్మూరులో కాస్త బలం తగ్గినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండోసారి ఎమ్మెల్యే కావడంతో కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది.
అదే సమయంలో ఇక్కడ బిజేపి బలపడుతూ వస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని బిజేపి గెలుచుకుంది. అందులో భాగంగా ఆర్మూరు స్థానంలో బిజేపికి ఆధిక్యం వచ్చింది. అంటే ఇక్కడ బిఆర్‌ఎస్ పార్టీకి బిజేపి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా ఈ సారి ఇక్కడ బిజేపి తరుపున ఎంపీ అరవింద్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అరవింద్ బరిలో దిగితే జీవన్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వవచ్చు.
అటు బిజేపి తరుపున అల్జాపూర్ శ్రీనివాస్ సైతం సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు ఇతర నేతలు ఆర్మూరు సీటుపై దృష్టిపెట్టారు. అయితే ప్రధాన పోటీ మాత్రం బిఆర్‌ఎస్-బిజేపిల మధ్యే ఉండే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ సారి ఆర్మూరు సీటు ఎవరు దక్కించుకుంటారో.