చిన్నప్పటి ఆలీ బాబా 40 దొంగల కథ కంటే, జగన్ బాబా 25 దొంగల కథ ప్రజల నాలుకలపై బాగా ప్రాచుర్యం పొందిందని బుద్దా వెంకన్న చురకలు అంటించారు. కొబ్బరి చిప్పల దొంగకు దేవాదాయ శాఖ ఇస్తే, కోట్లుకొట్టేశారని.. నేరచరిత్రలో ఆరితేరిన జగన్, ఎవరు ఏ శాఖలో నిపుణులో ఆలోచించి మరీ వారికి సరిపోయే శాఖలిచ్చారని ఫైర్ అయ్యారు.
వెల్లంపల్లి పెడతాడు పెద్దబొట్టు.. దేవుని సొమ్ము కాజేయకుంటే ఒట్టు అని.. వెల్లంపల్లిని కేబినెట్ నుంచి తీసేసే ముందు అతను దొంగిలించిన రూ.1,525 కోట్లు జగన్ కక్కించాలని డిమాండ్ చేశారు. ఊసరవెల్లి మార్చే రంగుల కంటే వెల్లంపల్లి మార్చే రంగులు కోకొల్లలు అని.. పార్టీ జెండాలు మార్చడంలో వెల్లంపల్లిని మించినవారు భూమ్మీదే ఉండరన్నారు.
ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీల నుంచి జగన్ పంచన చేరి, ప్రజలకు పంగ నామాలు పెట్టారని.. రాష్ట్ర అభివృద్ధిలోనేకాదు, తన నియోజకవర్గంలో కూడా ప్రజలకు వెల్లంపల్లిది పెద్ద గుండుసున్నా, అవినీతిలో ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ వెల్లంపల్లి అన్న అంటూ ఆయన అభిమానులు ఆనందపడుతున్నారన్నారు. వెల్లంపల్లి అవినీతి, అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలున్నాయని.. వెల్లంపల్లి శ్రీనివాస్ సోదరుడు వెల్లంపల్లి రఘు ఏ-6 ముద్దాయిగా ఉన్నారని ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలున్నా, ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. జగన్ రెడ్డి దొంగల జాబితాలో, ప్రజాధనం బొక్కేయడంలో తొలి, మలి మంత్రిగా వెల్లంపల్లే మిగిలిపోతారన్నారు.