ఎన్టీఆర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చెబుతున్నాడు : బుద్దా వెంకన్న

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు వ్యాఖ్యలకు నిరసనగా వర్ల రామయ్య నిరసన కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ నిరసన కార్యక్రమంలో… తెలుగు దేశం పార్టీ నేతలు జూనియర్‌ ఎన్టీఆర్‌ ను టార్గెట్‌ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి లాగానో, ఆదిలాగానో స్పందిస్తాడనుకున్నామని… కానీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు జూనియర్ చెప్పారంటూ చురకలు అంటించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.

జూనియర్ స్పందన చూసి టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారని తెలిపారు. కొడాలి, వంశీ వ్యాఖ్యలు చూసి మా రక్తం ఉడుకుతోందని అటు టీడీపీ నేత నాగులు మీరా ఫైర్‌ అయ్యారు. కనీసం మేనత్త పేరు.. మామయ్య చంద్రబాబు పేరు కూడా ఎత్తలేదంటూ ఆగ్రహించారు. వంశీ కి, నానికి పార్టీ టిక్కెట్లు ఇప్పించి నేడు ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. ఇక అటు అసెంబ్లీ ఘటనపై ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. కొడాలి నాని, వంశీ జూనియర్ శిష్యులే కదా..? కొడాలి నాని, వంశీలను ఎన్టీఆర్ ఎందుకు హెచ్చరించ లేదని మండిపడ్డారు వర్ల రామయ్య.